రోజు రోజుకూ మానవత్వం మాయమైపోతోంది. కంటేనే అమ్మ కాదు.. పెంచినా అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదంటారు. అలాంటి అమ్మ.. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడే అక్కసుతో కొడుకునే హత్య చేయించింది. 24 ఏళ్ల పాటు పెంచి పెద్దవాడిని చేసి ఆ తల్లే ఇప్పుడు ఆ కొడుకు పాలిట రాక్షసిగా మారింది. నాన్న ఉండగా మరొకరితో సంబంధ ఎందుకు అని ప్రశ్నించిన చిన్న కారణంతో అతడి నిండు నూరేళ్ల జీవితాన్ని 24 ఏళ్లకే అంతమయ్యేలా చేసింది.
అక్రమ సంబంధం కోసం హత్య చేసినా.. చాలా తెలివిగా అసత్యపు ప్రచారంతో తన భర్త, ప్రియుడు, మేనల్లుడి సహకారంతో కొడుకును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పున్నపురెడ్డి పేట లో జరిగిన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధం గురించి కొడుక్కి తెలియడంతో.. తన భర్తకు ఎక్కడ చెబుతాడో అని బయడపిన ఆమె.. ఆస్తి కోసం గొడవ చేస్తున్నాడంటూ భర్తను నమ్మించి.. దత్తత తీసుకుని 24 ఏళ్ల పాటు పెంచిన కొడుకును తన భర్తతో హత్య చేయించింది.
గత నెల 18న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం, వెంకన్నపాలెం జగ్గునాయుడు చెరువులో ఓ యువకుడి మృతదేహం బయటపడింది. అనుమానస్పద హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి.. హత్య వెనుక ఉన్న కారణాలను చేధించారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన పున్నపురెడ్డి ప్రసాదుగా మొదట ఆ డెడ్ బాడీని గుర్తించారు. ఈ మృతదేహాన్ని పరిశీలించిన తరువాత దారుణమైన హత్యగా నిర్ధారించారు. దీంతో అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి చివరకు తన పెంపుడు తల్లిదండ్రులే ప్రసాదును హత్య చేసి.. చెరువులో పడేసినట్టు గుర్తించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పున్నపురెడ్డి పేటకు చెందిన పున్నపురెడ్డి సత్యం, సీతమ్మలకు సంతానం లేకపోవడంతో .. సత్యం తమ్ముడు కుమారుడైన ప్రసాదును పెంచుకున్నారు. కొన్నాళ్ల వరకు అల్లారుముద్దగానే పెంచుకున్నారు. ఆ తరువాత సత్యం సీతమ్మలకు కొడుకు పుట్టాడు. దీంతో సొంత కొడుకుపై మమకారం పెంచుకున్న దంపతులు తరువాత నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇటీవల పున్నపురెడ్డి సీతమ్మ అదే గ్రామంలోని మరో వ్యక్తి రామారావుతో వివాహేతరం సంబందం కొనసాగిస్తోంది. ఈ విషయాన్నిగుర్తించిన ప్రసాదు తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో అతడిపై కసి పెంచుకుంది ఆ పెంచిన తల్లి. అడ్డు తొలిగించుకోవాలని ప్లాన్ చేసింది. తన భర్త సత్యం, అక్రమ సంబంధం పెట్టుకున్నరామారావు లను పిలిచి ప్లాన్ ను వివరించింది.
ప్రసాదు బతికి ఉంటే ఆస్థిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని, తన సొంత కొడుకు రమణకు ఆస్తిలో వాటా తగ్గిపోతుందని భర్త సత్యాన్ని ఒప్పించింది. అతడ్ని హతమార్చేందుకు రామారావు సహకారం తీసుకోవాలని భర్తను కోరింది. కన్నకొడుకే ఆస్తి దక్కాలని భావించిన అతడు భార్య మాటలను నమ్మాడు. హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని వారంతా పథకం వేశారు. హత్య చేసిన రోజు వీరికి సహాయం చేసేందుకు మేనల్లుడైన యడ్ల రాంబాబుకు అడ్వాన్సుగా 10 వేల రూపాయలు లంచం ఇచ్చారు. హత్య తరువాత మరో 10వేలు ఇవ్వడానికి, అదే విధంగా 0.35 సెంట్లు భూమిని కూడా ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు.
గత నెల 16న చీపురుపల్లిలో అమ్మవారి పండగను చూసొచ్చి తాగిన మైకంలో పశువుల శాలలో నిద్రిస్తున్న ప్రసాదును నైలాన్ తాడుతో కాళ్లు చేతులు కట్టేసారు. ప్రసాదు అరవకుండా ప్యాకింగ్ టేపును నోటికి, ముక్కుకు కట్టేసి ఊపిరాడకుండా చంపేశారు. ప్రసాదు చనిపోయాడని నిర్థారించుకుని అక్కడ నుంచి మృతదేహాన్ని బండిపై తీసుకొచ్చి నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం గ్రామంలోని జగ్గునాయుడు చెరువులో పడేసి ఏం తెలియనట్టు వెళ్ళిపోయారు. ఇక సొంత కుమారుడు, జువైనెల్ అయిన పున్నపురెడ్ది రమణ అలియాస్ సంతోష్ ను కూడా హత్య జరిగిన రోజు సహాయం చేసేందుకు వాడుకుంది.
ప్రసాదు హత్య విషయం గ్రామంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ముందుగానే ప్రసాదు వ్యసనపరుడని, చీపురుపల్లి పండగకు వెళ్లిన ప్రసాదు తిరిగి రాలేదని సీతమ్మ, సత్యంలు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతుంటాడని గ్రామస్థులను సీతమ్మ, సత్యం దంపుతులు నమ్మించారు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు.
మరుసటి రోజు చెరువులో మ్ళత దేహం ఉండడం గమనించిన గ్రామస్తులు .. పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు వచ్చి అది ప్రసాదు మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతి వెనుక ఉన్న భయంకర నిజాలను వెలికి తీశారు. మ్ళతదేహానికి తాళ్లు, టేపు ఉండడం చూసి హత్యగా కేసును గుర్తించి దర్యాప్తును ముమ్మరం చేసారు. హత్య కు పథకం వేసిన సీతమ్మ, ఆమెకు సహాయం చేసిన పున్నపురెడ్డి సత్యం, పున్నపురెడ్డి రామారావు, జువైనెల్ అయిన రమణ అలియాస్ సంతోష్, యడ్ల రాంబాబులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.