ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఎవరూ ఊహించని స్థాయిలో 24 గంటల్లోనే ఆరువేలకుపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే చిత్తూరులో ప్రతి రోజు వేయికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాముగా మారింది.
తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలలో ఉప ఎన్నికలు నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరి నారాయణ పర్యవేక్షించారు. జిల్లాలో మూడు సెగ్మెంట్లలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సకలం సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నిక కోసం 12 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీకాళహస్తి లోని స్కిట్ కళాశాల నుంచి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి, ఎన్నికల సిబ్బంది తరలింపు ప్రక్రియ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలను ఎన్నికల పర్యవేక్షణ అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ హరి నారాయణ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి నియోజకవర్గాల పరిధిలో 1057 పోలింగ్ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దాదాపు 95 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ కలిగిస్తున్న తిరుపతి లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17 లక్షల 40 వేల ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 8 లక్షల 38 వేల 540. మహిళలు 8 లక్షల 71 వేల 943. తిరుపతి లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, చిత్తూరు జిల్లాలో మూడున్నాయి.
మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2 వేల 470 ఉన్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో 339 సెంటర్లు, గూడూరు 366, సూళ్లూరుపేట 343, వెంకటగిరు 366, తిరుపతి 382, శ్రీకాళహస్తి 362, సత్యవేడు 312 కేంద్రాలు. 877 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు.
యోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. దాదాపు 3 వేలమంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. కేంద్ర బలగాలకు తోడు మైక్రో అబ్జర్వర్ లను నియమించినట్లు తెలిపారు. 528 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఎన్నికలను బహిష్కరించే గ్రామం ఏదైనా ఉంటే అక్కడికి ఎమ్మార్వో వెళ్లి వారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.
ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ప్రతిఒక్క పౌరుడు మాస్కులు ధరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఎక్కువమంది ఓటర్లున్న కేంద్రాలను రెండుగా విభజించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ కోసం ప్రత్యేక సిబ్బంది వుంటారని కలెక్టర్ వెల్లడించారు.