తిరుపతి ఉప ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి కొనసాగుతోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో కోవిండ్ నిబంధనలు పాటిస్తూనే పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వికలాంగుల సైతం భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తిలోని మన్న సముద్రంలో ఓటర్లతో పాటు క్యూ లైన్లో నిల్చుని గురుమూర్తి ఓటేశారు.
ఓటు వేసేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి అక్కడ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. క్యూ లైన్లో ఉన్న వారందరికీ నమస్కరించి.. ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. భారీగా పోలింగ్ నమోదవుతుుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తిరుపతి వైసీీపీ ఎంపీ అభ్యర్థి మతం, కులంపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడు హిందూ కాదంటూ.. బీజేపీ జాతీయ నేతలు సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేసిన తరువాతే ఓటింగ్ కు వెళ్లడం విశేషం.
తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురు మూర్తి తాను ఓటు హక్కు వినియోగించుకునే ముందు గో మాతకు పూజ నిర్వహించి తరువాత ఓటు హక్కు వేసేందుకు వెళ్లారు.
టీడీపీ లోక్ సభ అభ్యర్థి పనబాక లక్ష్మి తన కుటుంబ సమేతంగా వెళ్లి పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ జరుగుతున్న తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సమాచారం తెప్పించుకుని.. పోలింగ్ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ముఖ్యంగా వైసీపీ నేతలు బయట నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లను రప్పిస్తున్నారని.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు టీడీపీ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం సరళి చూస్తుంటే భారీగానే పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళా ఓటర్లు 8,38,540 మంది ఉన్నారు.
తిరుపతి పోలింగ్ లో కొన్ని చోట్ల అవాంతరాలు తప్పడం లేదు. వాకాడు మండలం నిడిగుర్తి పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంకు బ్యాటరీలు లేకపోవడంతో పోలింగ్ నిలిచిపోయిందని.. ఇది సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిదర్శనమని అక్కడి ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు తిరుపతి పోలింగ్ బూత్ దగ్గర టిడిపి కార్యకర్తలతో తిరుగుతున్న టిడిపి నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.