NASA MARS HELICOPTER FLIGHT NASA TO FLY A HELICOPTER TODAY ON MAR TO FIND ENVIRONMENT OF PLANET FOR FUTURE FLYINGS HERE IS THE FULL DETAILS NK
NASA - Mars: నేడు మార్స్‌పై ఎగరనున్న నాసా హెలికాప్టర్... ఏంటి దాని ప్రత్యేకత...
నేడు మార్స్‌పై ఎగరనున్న నాసా హెలికాప్టర్ (image credit - NASA/JPL-Caltech)
NASA - Mars Helicopter Flight: ఆ మధ్య పెర్సెవరాన్స్ (perseverance rover) రోవర్‌ని మార్స్‌పైకి పంపిన నాసా... ఇవాళ అంగారకుడిపై హెలికాప్టర్ ఎగరేయబోతోంది. ఎందుకో తెలుసుకుందాం.
NASA - Mars: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) చేసిన ఓ ప్రకటన ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తోంది. ఏంటంటే... ఇవాళ... అమెరికా టైమ్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున... భారత కాలమానం ప్రకారం... నేటి మధ్యాహ్నం తర్వాత... మార్స్ (అంగారక గ్రహం లేదా కుజ గ్రహం లేదా మంగళ గ్రహం లేదా అరుణ గ్రహం)పై తొలిసారిగా ఓ హెలికాప్టర్ ఎగరబోతోంది. ప్రస్తుతం అత్యంత చల్లగా ఉన్న మార్స్‌పై వారం కిందటే ఈ హెలికాప్టర్ ఎగరాల్సి ఉన్నా... టెక్నికల్ సమస్యలతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ చిన్న హెలికాప్టర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకూ భూమిపై తప్ప మరే గ్రహంపైనా, ఉపగ్రహంపైనా హెలికాప్టర ఎగరలేదు. ఇది గనక ఎగిరితే... మార్స్‌పై విమానాలు, హెలికాప్టర్లు ఎగిరేందుకు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనే విషయాన్ని నాసా తెలుసుకోగలదు.
హెలికాప్టర్ ఎగరగానే వెంటనే ఆ విషయం నాసాకి తెలియదు. అక్కడి నుంచి డేటా నాసాకి చేరాలంటే కొన్ని గంటలు పడుతుంది. ఎందుకంటే మార్స్ మన భూమికి పక్కనే ఉన్నా... రెండింటి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు. అంత దూరం నుంచి డేటా రావాలంటే ఆ మాత్రం టైమ్ పడుతుంది. 19న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హెలికాప్టర్ ఎగురుతుందని నాసా చెప్పింది. మన ఇండియా టైమ్ ప్రకారం అయితే... నేటి మధ్యాహ్నం తర్వాత సమయంలో ఎగురుతుంది. దాన్ని మీరు లైవ్‌లో చూడవచ్చు. లైవ్ లింక్ ఇదే...
భూమిపై హెలికాప్టర్లు ఎగిరేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. మార్స్‌పై అలా కాదు. అక్కడి గాలిలో బలం ఉండదు. చాల సన్నటి గాలి (thin air). భూమిపై ఉండే గాలి ప్రెషర్‌తో పోల్చితే... మార్స్‌పై ఉన్న గాలి ప్రెషర్ 1 శాతం కంటే తక్కువేనట. అందుకే... అసలు హెలికాప్టర్ ఎగరగలదా లేదా అన్నది నాసా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ప్రశ్న.
హెలికాప్టర్ ఎప్పుడు వెళ్లింది?
చాలా మందికి వస్తున్న ప్రశ్న ఇది. ఎందుకంటే మార్స్‌కి ఏది పంపినా నాసా ఆ వివరాలు ప్రజలకు చెబుతుంది. ఈ హెలికాప్టర్ ఎప్పుడు వెళ్లిందో ముందే చెప్పినా... ఎవరూ పట్టించుకోలేదు. దాంతో... ఇది ఎప్పుడు వెళ్లింది అనే డౌట్ చాలా మందికి వస్తోంది. ఆ మధ్య పంపిన పెర్సెవరాన్స్ రోవర్ కింది భాగంలా... ఈ హెలికాప్టర్‌ను అతికించినట్లుగా సెట్ చేసింది నాసా. ఇది ఫిబ్రవరి 18న ఆ రోవర్ నుంచి విడిపోయి మార్స్‌పై అడుగుపెట్టింది. ఇప్పుడు ఇది ఎగిరే దృశ్యాలను పెర్సెవరాన్స్ షూట్ చేస్తుంది. ఆ డేటాను భూమికి పంపుతుంది.
రైట్ సోదరులతో లింక్ ఏంటి?
మీకు తెలుసుగా... మన భూమిపై రైట్ సోదరులు (wright brothers) 1903లో తొలిసారి విమానాన్ని ఉత్తర కాలిఫోర్నియాలోని కిట్టీ హాక్ దగ్గర ఎగరేశారు. అదే విధంగా... ఇప్పుడు నాసా... తొలి హెలికాప్టర్‌ను మార్స్‌పై ఎగరేస్తోంది. 1903లో ఎగిరిన విమానం తాలూకు చిన్న ముక్కను... ఆ హెలికాప్టర్లో ఉంచింది నాసా. రైట్ సోదరులకు గౌరవసూచకంగా అలా చేసింది. అందుకే ఆ హెలికాప్టర్ కచ్చితంగా ఎగరాలని శాస్త్రవేత్తలు, యువత ఆశగా చూస్తున్నారు. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.