నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్ బహిరంగ సభపై సస్పెన్స్‌కు తెరపడింది. ఆయన హాజరుకాబోయే సభకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీఎం కేసీఆర్ హాలియాలో తలపెట్టిన సభను రద్దుచేయాలని రైతులు వేసిన పిటిషన్‌ను విచారణకు తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే రైతుల హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో సీఎం కేసీఆర్ సభకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రేపు యథావిథిగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ అధినేత కేసీఆర్ బహిరంగసభ జరగనుంది. ఇప్పటికే సాగర్‌లో మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సభతో నోముల భగత్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
ఎన్నికల ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందుగానే సీఎం కేసీఆర్ మరోసారి సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రాబోతుండటం విశేషం. సాగర్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్.. చివరి నిమిషం వరకు వేచి చూసి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టికెట్ ఇచ్చారు.
సాగర్‌లో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న గులాబీ బాస్.. పరిస్థితిని సమీక్షిస్తూ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలుస్తోంది. సాగర్‌లో మంచి మెజార్టీ సాధించడం ద్వారా బీజేపీ దూకుడుకు కళ్లెం వేయొచ్చనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా చెక్ చెప్పిన గులాబీ బాస్.. సాగర్ ఎన్నికల ద్వారా మరోసారి ఆ పార్టీపై పైచేయి సాధిస్తారేమో చూడాలి.