NIGERIAN TEEN GETS 19 SCHOLARSHIP OFFERS WORTH 5 MILLION DOLLARS FROM THE US CANADA SK GH
17 ఏళ్ల యువతికి రూ. 37 కోట్ల స్కాలర్‌షిప్.. ఒకేసారి ఇన్ని ఆఫర్లా.. మైండ్ బ్లోయింగ్..
యింకా బంజో (Image:Twitter)
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా ఏకంగా 19 యూనివర్సిటీలు ఆమెకు స్కాలర్‌షిప్‌లతో కూడిన ప్రవేశాలను ఆఫర్ చేశాయి. అంతేకాదు, మొత్తం 5 మిలియన్ డాలర్ల విలువైన స్కాలర్షిప్లను ఆఫర్ చేశాయి.
తన అసాధారణ ప్రతిభతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి ఏకంగా 19 స్కాలర్షిప్లను దక్కించుకొని చరిత్ర సృష్టించింది నైజీరియా యువతి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా ఏకంగా 19 యూనివర్సిటీలు ఆమెకు స్కాలర్‌షిప్‌లతో కూడిన ప్రవేశాలను ఆఫర్ చేశాయి. అంతేకాదు, మొత్తం 5 మిలియన్ డాలర్ల విలువైన స్కాలర్షిప్లను ఆఫర్ చేశాయి. ఆ యువతి పేరు విక్టరీ యింకా బాంజో. ఈ 17 ఏళ్ల యువతి పేరు ఇప్పుడు నైజీరియా అంతటా మార్మోగిపోతుంది. ఇన్ని స్కాలర్‌షిప్ ఆఫర్లు వస్తాయని ఊహించలేదని చెబుతోంది విక్టరీ. ఆమె తండ్రి చికా యింకా బాంజో ప్రస్తుతం లాగోస్ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఆమె తల్లి అడియెంకా బాంజో ఒక ప్రైవేట్ రంగ సంస్థలో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.
విక్టరీకి యూకేలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐవీ లీగ్ స్కూల్, యేల్ కాలేజ్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, హార్వర్డ్ కాలేజ్, బ్రౌన్ యూనివర్సిటీలు స్కాలర్‌షిప్ ఆఫర్ చేశాయి. వీటితో పాటు అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, వర్జీనియా విశ్వవిద్యాలయం వంటివి కూడా స్కాలర్‌షిప్ ఆఫర్ చేయడం విశేషం. ఇక, కెనడాలోని ప్రతిష్టాత్మక టొరంటో విశ్వవిద్యాలయం నుంచి లెస్టర్ బి. పియర్సన్ స్కాలర్‌షిప్, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి కరెన్ మెక్‌కెల్లిన్ ఇంటర్నేషనల్ లీడర్ ఆఫ్ టుమారో (కెమిలోట్) స్కాలర్‌షిప్ ఆఫర్‌ను అందుకుంది.
ఈ విషయం గురించి విక్టరీ మాట్లాడుతూ... “ఇంత పెద్ద మొత్తంలో స్కాలర్ షిప్ ఆఫర్‌ను నమ్మలేకపోతున్నాను. నా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం చాలా యూనివర్సిటీలకు దరఖాస్తు చేశాను. అయితే ఇలా అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్‌తో పాటు స్కాలర్‌షిప్ లభిస్తుందని నేను అస్సలు ఊహించలేదు” అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
అకడమిక్ రికార్డు
2020 చివరిలో నిర్వహించిన వెస్ట్ ఆఫ్రికన్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (WASSCE)లో విక్టరీ టాప్ స్కోరు సాధించింది. ఫలితంగా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ఆమెకు స్కాలర్‌షిప్ ఇవ్వడానికి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ (CIE) నిర్వహించిన ఐజిసిఎస్ఈ పరీక్షలో ‘ఎ’ గ్రేడ్ సాధించింది. దీంతో కేంబ్రిడ్జి ఆమెకు స్కాలర్‌షిప్‌తో కూడిన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసింది.
ఈ విజయం కొన్ని సంవత్సరాల కృషి అని చెబుతోంది విక్టరీ. ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి ఇలా స్కాలర్‌షిప్ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. అండర్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో కంప్యూటేషనల్ బయాలజీపై అధ్యయనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె పేర్కొంది. అడ్మిషన్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి, డ్యూక్, జాన్స్ హాప్కిన్స్ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీలను పోల్చుకొని నిర్ణయం తీసుకుంటానని చెప్పింది.
నైజీరియా యువతకు ప్రేరణ
విక్టరీ సాధించిన ఘనతపై ఆమె తల్లి చికా మాట్లాడుతూ.. "అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ నా కూతురు స్థానిక నైజీరియాలో భాషలోనే తన ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక వర్సిటీల్లో స్కాలర్‌షిప్ ఆఫర్ రావడం గొప్ప విషయం. నైజీరియా దేశంలోని యువతకు నా కూతురు స్ఫూర్తిగా నిలిచింది” అని వివరించారు.