FOUR DAY WORKWEEK UNLIMITED PAID LEAVES TO OYO EMPLOYEES DUE TO IMPACT OF COVID 19 NS GH
COVID-19 Effect: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 4 రోజులే వర్క్.. అడిగినన్ని సెలవులు
ప్రతీకాత్మక చిత్రం
కరోనా నేపథ్యంలో ఓ ప్రముఖ సంస్థ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి కేవలం నాలుగు రోజులు పని చేయండి చాలు అంటూ ఆఫర్ ఇచ్చింది. ఇంకా కారణం చెప్పకుండానే కావాల్సినన్ని సెలవులు తీసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది కాలంగా చాలా కంపెనీలు ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యాన్ని తమ ఉద్యోగులకు ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ కొన్ని కంపెనీలు వారానికి నాలుగు రోజులే పనిచేసే సదుపాయాన్ని కల్పించాయి. తాజాగా ఈ జాబితాలో ఆతిథ్య సంస్థ ఓయో కూడా చేరిపోయింది. ఆతిథ్య రంగంలో పర్యాటకులను మంచి రాయితీలను అందిస్తోన్న ఈ కంపెనీ ఉద్యోగుల కష్టాన్ని కూడా గుర్తించింది. వారాంతాలతో పాటు మరోక రోజును అదనపు సెలవు ఇవ్వడమే కాకుండా అపరిమిత పెయిడ్ లీవ్స్ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. అపరిమిత పెయిడ్ లీవ్స్.. "ఈ రోజు నుంచి వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయి. సంప్రదాయానికి భిన్నంగా బుధవారం సెలవు దినంగా ప్రకటించాం. ఓయో సిబ్బందికి ఒత్తిడి కలగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నాం. అంతేకాకుండా ఎలాంటి ప్రశ్నలు అడకుండా అపరిమిత పెయిడ్ లీవ్స్(భత్యంతో కూడిన సెలవులు) ఇవ్వనున్నాం. మీకు అవసరమైనప్పుడల్లా సెలవు తీసుకోండి. మీరు లాగిన్ కావాల్సిన అవసరం కూడా లేదు. విషయాన్ని మెనేజర్ కు తెలియజేయండి. కారణాలు చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారం మెరుగుపరచాలని మేము ఒత్తిడి కూడా చేయం" అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ తన బ్లాగింగ్ సైట్ లో చేసిన ట్వీట్ లో స్పష్టం చేశారు.
అంతేకాకుండా కుటుంబంతో గడపడం కోసం తాను కూడా ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటానని, కరోనా సోకిన తన స్నేహితుడితో మాట్లాడతానని రితేశ్ అగర్వాల్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ జాబితాలో స్విగ్గీ.. ఓయో మాత్రమే కాదు.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా ఇప్పటికే తన సిబ్బందికి వారానికి నాలుగు రోజుల పనిదినాలు కల్పించింది. మే ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.
తమ సిబ్బందికి కష్టకాలంలో మద్దతుగా ఉంటామని, కోవిడ్ ఆస్పత్రుల్లో పడకలు, ఐసీయూ, ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు తదితర విషయాల్లో సపోర్ట్ చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే వారికి పోషకాహారం అందిస్తోంది. స్విగ్గీ ఇప్పటికే తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డెలివరీ భాగస్వాములకు దాదాపు 2 లక్షల మందికి టీకాలు వేయించింది. ఇటీవలే ఈ సంస్థ 800 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. దీంతో 5 బిలియన్ డాలర్ల విలువను పొందింది.