ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కరోనా గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రజలు కరోనాతో పాటు ఫేక్ న్యూస్ మీద కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. కరోనా గురించి ప్రజలు ఆందోళనతో ఉంటే.. దీనికి తగినట్టు ఈ సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. కొందరు ఆ ప్రచారాన్ని నిజమేనని నమ్మి దాన్ని వాళ్లు కూడా ఇతరులతో పంచుకుంటూ తమకు తెలియకుండా తాము ఆ తప్పుడు ప్రచారంలో భాగం అవుతున్నాయి. ఇంతకీ ఇంత విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ వార్త ప్రచారం జరిగింది. అదేంటంటే, వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యే వారికి, సిగరెట్లు తాగే వారికి కరోనా రిస్క్ తక్కువగా ఉంటుందనేది ఆ వార్త సారాంశం. ఇలాంటి న్యూస్ కోసం ఎప్పుడూ ఆసక్తిగా చూసే నెటిజనం.. దీన్ని పెద్ద ఎత్తున వాట్సాప్‌లో ఫార్వర్డులు చేశారు. అలాగే, సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. వెజిటేరియన్ ఫుడ్ తినే వారికి, సిగరెట్లు తాగే వారికి కరోనా రిస్క్ తక్కువగా ఉంటుందనే ప్రచారం పచ్చి అవాస్తవం. అలాంటి వాదనలు నమ్మొత్తు. అదంతా ఫేక్ న్యూస్ అని కుండబద్దలు కొట్టింది. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త అంతా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రచార శాఖ స్పష్టం చేసింది. ట్విటర్ వేదికగా పీఐబీ ఈ వివరాలు వెల్లడించింది.‘వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యే వారికి, పొగత్రాగే వారికి కరోనా రాదనేదానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సహేతుకమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అసలు అలాంటి స్టడీ కూడా ఏదీ చేయలేదు.’అని పీఐబీ స్పష్టం చేసింది.
Media reports claim that @CSIR_IND survey reveals smokers & vegetarians are less vulnerable to #COVID19#PIBFactCheck: Presently, NO conclusion can be drawn based on the serological studies that vegetarian diet & smoking may protect from #COVID19
ఇక భారత్‌లో మొన్న 3,49,691 కొత్త కేసులు రాగా... నిన్న 3,52,991 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరింది. కొత్తగా 2,812 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,95,123కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,43,04,382కి చేరింది. రికవరీ రేటు 83.5 శాతం నుంచి తగ్గి... 82.6 శాతానికి పడిపోయింది. దేశంలో కొత్త కేసులు పెరుగుతూ ఉంటే రికవరీ రేటు రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం భారత్‌లో 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 14,02,367 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 27 కోట్ల 93లక్షల 21వేల 177 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 9,95,288 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 19లక్షల 11వేల 223 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.