JDU MLA AND FORMER MINISTER MEWALAL CHOUDHARY PASSES AWAY DUE TO COVID19 AT A HOSPITAL IN PATNA SSR
Corona: కోవిడ్ డేంజర్ బెల్స్.. కరోనా సోకిన మూడు రోజులకే ఎమ్మెల్యే మృతి..!
ప్రతీకాత్మక చిత్రం
మేవాలాల్కు మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన మరణించినట్లు...
పాట్నా: కోవిడ్-19 మాజీ మంత్రి ప్రాణం తీసింది. బీహార్‌లో మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనా బారిన పడి మృతి చెందారు. పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మేవాలాల్కు మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మేవాలాల్ చౌదరి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే-జేడీయూ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో దుమారం రేగింది. ఆయనపై ఆర్జేడీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన సమయంలో మేవాలాల్ అవినీతికి పాల్పడ్డారనేది ఆర్జేడీ ప్రధాన ఆరోపణ. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జూనియర్ అసిస్టెంట్స్ నియామకాల సమయంలో రూల్స్‌ను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడి అనర్హులకు ఆ ఉద్యోగాలు కట్టబెట్టారని మేవాలాల్‌పై ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా.. మేవాలాల్ మూడు రోజుల్లోనే కరోనా కారణంగా చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయాలని వైద్యులు భావిస్తున్నారు. బీహార్‌లో కరోనా వ్యాప్తి కలవరపెడుతోంది. గంటకు 327 మంది కరోనా బారిన పడుతున్నారు. అంతేకాదు, గంటకు ఇద్దరు కరోనా కారణంగా చనిపోతున్నారు. శనివారం ఒక్కరోజే బీహార్‌లో 7870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
Bihar: Mewalal Choudhary, JDU MLA and former minister, passes away due to #COVID19 at a hospital in Patna.
అంతేకాదు.. బీహార్‌లో కరోనా పేషంట్స్‌కు బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ సిలిండర్లు కూడా సరిపడినన్ని లేని పరిస్థితి ఉంది. పాట్నాలోని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బెడ్లు ఖాళీ లేక, ఆక్సిజన్ కొరత కారణంగా చాలామంది కరోనా సోకిన బాధితులను వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి నెలకొంది. బీహార్‌లో కరోనా తీవ్రత తగ్గాలంటే లాక్డౌన్ తప్ప వేరే దారి కనిపించడం లేదని సీనియర్ వైద్యాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. బీహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెకండ్ వేవ్ గుబులు రేపుతోంది. బీహార్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే వెలుగుచూస్తుండటం గమనార్హం.