ఆంధ్రప్రదేశ్ పై కరోనా రక్కసి పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. గత నెల వరకు ఎవరూ ఇంత పెను ప్రమాదాన్ని ఊహించి ఉండరు. మార్చి నెలలో ప్రతి రోజు వందల సంఖ్యలో కనిపించిన కేసులు ఇప్పుడు పది రెట్లు పెరిగాయి. 24 గంటల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఆరు వేల మార్కును దాటింది. గత మూడు రోజుల కరోనా సోకిన వారి సంఖ్య చూస్తే షాక్ తగులుతోంది. అంటే తొలి దశ కంటే ఈ సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. మరోవైపు అదే స్థాయిలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం అందరిలో ఆందోళన పెంచుతోంది..
రోజు రోజుకూ వెంటాడుతున్న వైరస్ నేపథ్యంలో చాలాచోట్ల అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కు సిద్ధంగా లేమని ప్రకటిస్తున్నాయి. లాక్ డౌన్ పరిస్థితి రాకుండానే కరోనా కట్టడిపై ఫోకస్ చేస్తున్నామంటున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు అలా కనిపించడం లేదు. గతంకంటే ప్రస్తుతం వైరస్ చాలా ప్రభావం చూపిస్తోంది. దీంతో చాలా చోట్ల వ్యాపారస్తులే స్వచ్చంధ లాక్ డౌన్ కు ముందుకు వస్తున్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే సరైన ఆయుధమని ప్రభుత్వాలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ ప్రజల్లో అపోహలకు తోడు.. సరిపడ డోసులు అందుబాటులో లేకపోవడం కూడా ఆందోళన పెంచుతోంది.
తాజాగా విజయవాడ ఛాంబెర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వ్యాపారస్థులు కూడా తమవంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక ప్రకటన విడుదుల చేసింది. దీనిలో భాగంగా విజయవాడ చాంబర్ లో అధ్యక్షులు కొనకళ్ల విద్యాసాగరరావు అధ్యక్షతన అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల సమావేశం నిర్వహించారు.
కరోనా కట్టడి చర్యలపై సుదీర్ఘంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనిలో భాగంగా ఈ ఆదివారం అంటే 18వ తేదీన విజయవాడలో ఉన్న వ్యాపార సంస్తలు అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలని.. తరువాత ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని నిర్ణయించారు. విజయవాడ చాంబర్స్ ఆఫ్ కామర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వ్యాపారా, వాణిజ్య సంస్థలు యథావిథిగా పాటించాలని అధ్యక్షులు కోరారు.
మరోవైపు కరోనా కట్టడిలో భాగంగా ప్రతి వ్యాపార సంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు తప్పని సరిగా మాస్కు ధరించాలని, షాపులు, వ్యాపార సముదాయల దగ్గర తప్పకుండా శానిటేషన్ చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మన చుట్టుపక్కల ఉన్న వాళ్లు పాటించేలా చేయాలని కోరారు. అలాగే వినియోగదారులు కూడా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోవద్దని కోరారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం మరిచిపోవద్దని సూచించారు.