TIRUPATI SOME VILLAGERS BOYCOTT POLLING DURING TIRUPATI BY ELECTIONS AS THEY OPPOSING THE MERGE OF VILLAGES IN SRIKALAHASTHI MUNICIPALITY FULL DETAILS HERE PRN
Tirupati By Elections: తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్.. పోలింగ్ బహిష్కరించిన ఓటర్లు
ప్రతీకాత్మకచిత్రం
తిరుపతి పార్లమెంట్ స్థానంలో ఉపఎన్నికకు (Tirupati By Election) అంతా సిద్ధమైంది. ఐతే కొన్ని గ్రామాల్లో స్థానికులు పోలింగ్ ను బహిష్కరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ప్రచారం ముగియడంతో గెలుపు భారం ఓటర్లపై వేసిన పార్టీలు.. పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి రత్నప్రభ పోటీలో ఉన్నారు. ఐతే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుండగా కొన్ని గ్రామాల ఓటర్లు పార్టీలకు షాకిచ్చారు. పోలింగ్ లో పాల్గొనేది లేదని తెగేసిచేప్తున్నారు. ఎవరూ ఓటు వేయొద్దంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఓ మాజీ మంత్రి సొంతగ్రామంలో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించడం చర్చనీయాంశమైంది. పోలింగ్ ముందు ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల నిర్ణయం పార్టీల్లో గుబులు రేపుతోంది.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో శ్రీకాళహస్తి ముఖ్యమైనది. ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీకాళహస్తికి సమీపంలోనే ఊరందూరు గ్రామం ఉంది. ఈ గ్రామం టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం. ప్రస్తుతం ఈ గ్రామస్తులు తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నిను బహిష్కరించారు. ఇందుకు కారణం ప్రభుత్వ నిర్ణయమే. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తన అనుమతి లేకుండా కనీసం గ్రామ సభ నిర్వహించి అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడమే కాకుండా.. గ్రామాన్ని మూడు ముక్కలు చేసి మూడ వార్డులుగా చేశారని ఆరోపిస్తున్నారు. ఊరందూరుతో పాటు మరో ఆరు గ్రామాలను ప్రభుత్వం మున్సిపాలిటీలో విలీనం చేసింది. టీఎన్ కండ్రిగ, నారాయణ కొత్తూరుతో పాటు మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. వారు కూడా ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం పోలింగ్ ఉన్నందున గ్రామస్తులందరూ సమావేశమై ఓట్లు వేయకూడదని తీర్మానించుకున్నారు. గ్రామాల్లో చాటింపు కూడా వేయించారు. తమను సంప్రదించకుండానే గెజిట్ విడుదల చేశారని మండిపడుతున్నారు. రేపు గ్రామంలో ఒక్కరు కూడా ఓటు వేయరని.. అవసరమైతే పోలింగ్ బూత్ కు తాళం వేసి నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. పోలింగ్ సిబ్బంది వచ్చినా, విధులు నిర్వర్తించినా ఓటు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకించిన స్థానికులు దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది విచారణలో ఉంది.