
- News18 Telugu
- Last Updated: April 13, 2021, 15:26 IST
ఏపీలో తిరుపతి ఉప ఎన్నికతో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నికకు సమయం ఎక్కువ లేకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అదికార వైసీపీ, టీడీపీ మధ్య వార్ పీక్ కు చేరింది. తాజాగా సోమవరాం తిరుపతిలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపేయి. ఓటమికి భయపడి వైసీపీ నేతలే తమపై రాళ్లతో దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ రాళ్లను చూపిస్తూ.. పోలీసులు ఏమయ్యారని ప్రశ్నిస్తూ చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కాసేపు తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అయినా ఆ రాళ్ల రాజకీయానికి తెరపడలేదు. తాజాగా టీడీపీ నేతలు దీనిపై ఏపీ గవర్నర్ ను కలవనున్నారు. రాళ్ల దాడి ఘటనను గవర్నర్ కు వివరించి.. చర్యలు తీసుకోవాలని కోరనున్నారు..
తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరిగిందని నిందలు వేయడం పూర్తిగా అవాస్తవమని ఖండించారు ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత. కేవలం తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతో.. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే రాళ్ల దాడి జరినట్లు చిత్రీకరించారని ఆమె విమర్శించారు. రాళ్ల దాడి చేయాల్సిన అవసరం ఏ ఒక్క వైసీపీ నేతకు కానీ.. కనీసం కార్యకర్తకు కూడా లేదన్నారు. తిరుపతిలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీ ఖాయమైందని జోస్యం చెప్పారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థిని గురుమూర్తిని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసును కూడా భూతద్దంలో చూపించడం దారుణమన్నారు. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే నిజాలు బయటకొస్తాయని హోం మంత్రి స్పష్టం చేశారు.
వైసీపీ నేతలే తమపై రాళ్ల దాడి చేయించారని చెబుతుంటే.. అధికార పార్టీ వైసీపీ నేతల వెర్షన్ వేరేలా ఉంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలకు తెర లేపారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతి పర్యటనలో రాళ్లు వేశారని, దానికి వైఎస్సార్‌సీపీ నేతలే కారణమని చంద్రబాబు నిందలు వేయడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. మిద్దెపై నుంచి రాయి విసిరారని చెబుతున్న చంద్రబాబు.. అది ఎవరికి తగిలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి సానుభూతి కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారని ఆరొపించారు. ఆ రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయినా దాడి జరిగిన వెంటనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జోడించి విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబుకు తగదన్నారు. సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
ఇటు టీడీపీ నేతలు తమపై దాడి జరిగిందని.. ఆ రాళ్లను పట్టుకుని కూడా చూపిస్తున్నారు. దీనిపై గవర్నర్ దగ్గర పంచాయతీ తేల్చుకోడానికి సిద్దమయ్యారు. అటు వైసీపీ నేతలు మాత్రం అసలు దాడే జరగలేదు అంటున్నారు. మరి ఏది వాస్తవమనే ప్రచారం జోరందుకుంది.