
- News18 Telugu
- Last Updated: April 14, 2021, 15:56 IST
త్వరలో జరగనున్న సాగర్ బై పోల్ ఎలక్షన్ కు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికి వారు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. కానీ హాలియా ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డికి నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారరథాన్ని ఆపి ఓ నిరుద్యోగి నిరుద్యోగ భృతిని ఎప్పుడు అమలు చేస్తారు.. నోటిఫికేషన్ లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడ్డుకున్నాడు. ఆగ్రహానికి గురయిన మంత్రి నీలాంటోల్ని చాలా మందిని చూశాం.. నిన్ను నీ నాయకుడిని తొక్కిపడేస్తం బిడ్డా.. అంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అతడిని పక్కకి లాక్కుపోయారు. అసలేం జరిగిందంటే.. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి హాలియా నియోజకవర్గంలోని అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ.. టీఆర్ఎస్ ను ఆదరించాలంటూ ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో ప్రచారం రథంపై నుంచి మంత్రి ప్రసంగిస్తుండగా ఓ నిరుద్యోగ యువకుడు వెళ్లి అడ్డుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతి సంగతి ఏం చేశారని, ఎన్నకల్లో ఇచ్చన హామీలను అమలు చేయకుండా ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి జగదీశ్‌రెడ్డి ‘నీలాంటి కుక్కలను చాలామందిని చూశాం.. నిన్ను, నీ నాయకుడిని తొక్కిపడేస్తాం..’ అని అన్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని యువకుడు మళ్లీ నిలదీయడంతో పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని పక్కకు లాక్కెళ్లారు. దీంతో మంత్రి ప్రచార రథం ముందుకెళ్లింది.
ఫిబ్రవరిలో అలీనగర్ సమీపంలో జరిగిన సీఎం కేసీఆర్ సభలో కూడా ఇలాగే కొందరు యువకులు ప్రసంగాన్ని అడ్డుకున్నప్పుడు కూడా కేసీఆర్ వాళ్లను కుక్కలతో పోల్చిన సంగతి తెలిసిందే. సరైన సమాధానం చెప్పకుండా నిరుద్యోగిని ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.