
- News18 Telugu
- Last Updated: April 15, 2021, 18:47 IST
ఏపీలో ప్రస్తుతం రాజకీయం పూర్తిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్ల పర్వం మరో లెవెల్ కు వెళ్లింది. రాజీనామాలకు సిద్ధమా అంటూ రెండు ప్రత్యర్థి పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. దీంతో విమర్శలు కూడా మరో స్థాయికి చేరుతున్నాయి. రాజకీయాలను రాజకీయాల్లానే చూడడం లేదు.. వ్యక్తిగతంగా శత్రువుల్లా మారుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు.
తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్ కు కొత్త పేరు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక నుంచి జగన్ రెడ్డి పేరు జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఎవరైనా సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుందని.. కానీ మన ఏపీలో సీఎం జాంబీ రెడ్డికి ఆనందం తెప్పించే విషయాలు వేరే ఉన్నాయి అంటూ ఆరోపించారు.
జాంబిరెడ్డికి టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులు చేయడం అంటే మహా ఆనందం అంటూ మండిపడ్డారు. తమ పార్టీ వారిపై కేసులు, అరెస్టుల వార్తలను టీవీల్లో చూసి.. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఉండే జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటారనంటూ సెటైర్లు వేశారు లోకేష్. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా మారారని.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని నారా లోకేష్ పరామర్శించారు. చట్టానికి వ్యతిరేకంగా తమపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉంచుకున్నామన్నారు. సరైన సమయంలో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తన పై కేసులు పెట్టండి బరిస్తా. తనను అరెస్ట్ చేసినా నో ప్రాబ్లమ్. అరెస్టులకు బాధపడను అన్నారు. కానీ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్.
సీఎం జగన్ కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తన సవాల్ కు స్పందించేవారని లోకేష్ ఎద్దేవ చేశారు. ఇప్పటికైనా తన సొంత బాబాయ్ ను చంపింది ఎవరో జగన్ బయట ప్రపంచానికి తెలియచేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పులు అసత్య ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్. ఇప్పటి వరకు ఒక్క ఆరోఫణ కూడా ఎందుకు రుజువు చేయలేకపోతున్నారని లోకేష్ నిలదీశారు. ఏపీలో జగన్ పరిపాలన చూసిన ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.