
- News18 Telugu
- Last Updated: April 16, 2021, 15:59 IST
విజయవాడ..! ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అభివృద్ధి చెందిన నగరం. ముఖ్యంగా రైల్వే పరంగా ముఖ్యమైన జంక్షన్. దేశంలో అత్యధిక రైళ్లు ప్రయాణించే రెండో అతిపెద్ద నగరం విజయవాడ. నిత్యం వందలాది రైళ్లు విజయవాడ జంక్షన్ కు వచ్చి వెళ్తుంటాయి. దేశంలోని ప్రధాన నగరాలను ఇతర ప్రాంతాలకు అనుసంధానించడంతో విజయవాడ కీలక పాత్ర పోషిస్తోంది. కరోనాకు ముందు ప్రతి రోజూ 250 రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తుండేవి. ఇప్పటికీ రోజుకి 150 రైళ్లు విజయవాడ వస్తున్నాయి. అలాగే రైల్వే శాఖకు విజయవాడ రైల్వే డివిజన్ గణనీయమైన ఆదాయాన్ని అందిస్తోంది. 1888లో విజయవాడ రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం 10 ఫ్లాట్ ఫామ్ లు, 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, రిటైరింగ్ రూములు, ప్యాసిజెంస్ డిస్ ప్లేస్ సిస్టమ్ లో మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి అత్యంత అధునాతంగా అభివృద్ధి చేశారు.
గతంలో విజయవాడ రైల్వే స్టేషన్ గుండా రోజుకు 2లక్షల మంది ప్రయాణం సాగించేవారు. ప్రస్తుతం లక్ష మంది వరకు వచ్చి వెళ్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలతో నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డును సాధించడమేకాక ఐఎస్పీ హోదాను కూడా కలిగి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్ ను ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రీ డెవలప్ మెంట్ పేరిట విజయవాడ రైల్వేస్టేషన్ ను 99 సంవత్సరాలపాటు ప్రైవేటుకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్రమోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో లాభాల్లో ఉన్న అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థయిన రైల్వేను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 150 రైళ్లను కార్పొరేట్లకు అప్పగించగా, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశాఖ- హైదరాబాద్ రైళ్లు కూడా ఉన్నాయి .
ఇది చదవండి: ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ ఇలా పొందండి...!
గతంలోనే విజయవాడ రైల్వే స్టేషను కమర్షియల్ గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని రైల్వే బోర్డు నిర్ణయించిన్పటికీ, బిడ్డర్లు రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేయగా, అందులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చింది.
దీనిపై రైల్వే కార్మిక సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.నంబర్ వన్ స్థానానికి అతి చేరువలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషను రైల్వేనే సొంతంగా రీ డెవలప్ మెంట్ చేసి, కమర్షియల్ గా అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి, ప్రయాణికులపై యూజర్ ఛార్జీల రూపంలో పెనుభారం పడే అవకాశం ఉంది. రైల్వే బోర్డు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విజయవాడ రైల్వే డివిజన్లోని ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రయాణికులు కూడా వ్యతిరేకిస్తున్నారు.