సినీ పరిశ్రమకు పైరసీ పెను ముప్పుగా మారింది. సినిమా రిలీజ్ అయిన ఒకటి రెండు రోజులకే పైరసీ కాపీలు బయటకు రావడంపై ఎప్పటినుంచో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా పైరసీకీ బ్రేకులు పడడం లేదు. తాజాగా వకీల్ సాబ్ కు పైరసీ షాక్ లు తప్పడం లేదు. తొలి రోజే పైరసీ కాపీ బయటకు రావడం ఆందోళన పెంచింది. అదే సమయంలో ఆ పైరసీని కేబుల్ టీవీలో ప్రసారం చేయడం మరింత దారుణం.
దీంతో టీవీలో వకీల్ సాబ్ సినిమా పైరసీ వివాదం రానురానూ ముదురుతోంది. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయనగరం పట్టణానికి చెందిన వాజీ కేబుల్ ఈ పైరసీకి పాల్పడిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. సినిమా రిలీజ్ రోజే ప్రమోషన్ పేరుతో పైరసీ క్లిప్పింగ్ లను ప్రసారం చేయడంపై నిర్మాతలు, పవన్ అభిమానులు, టాలీవుడ్ పెద్దలు మండిపడుతున్నారు.
సినిమా థియేటర్ లో మూవీ క్లిప్స్ షూట్ చేసి పైరసీ చేయడమే పెద్ద నేరం. అలాంటింది పైరసీ కాపీ క్లిప్పులను వాజీ ఛానల్ లో ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని నిర్మాతలు మండిపడుతున్నారు. దీంతో ఛానల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సినిమా నిర్మాత దిల్ రాజు తరపున హెచ్.వీ.చలపతి రాజు ఫిర్యాదు చేశారు.
వాజీ కేబుల్ చర్యతో సినిమా నిర్మాత లకు నష్టం కలిగిందని.. అందుకే దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. దీనిపై ఏఎస్పీ సత్యనారాయణ రావు స్పందిస్తూ వాజీ ఛానల్ లో ప్రసారం అయిన పైరసీ క్లిప్పింగ్ లపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ సైతం ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఓ వైపు పవన్ సినిమాకు టికెట్టు రేట్లు తగ్గించి ప్రభుత్వం కుట్ర చేసిందని.. ఇప్పుడు కేబుల్ యాజమాన్యంతో స్థానిక రాజకీయ నేతలే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం జీర్ణించుకోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.