ఏపీపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. 20 రోజుల క్రితం వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు 24 గంటల్లో 7 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయి అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 922 పరీక్షలు నిర్వహించగా.. 6 వేల 582 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9లక్షల 62 వేల 037 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలే స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించే పరిస్థితి నెలకొంది. ఇఫ్పటికే చాలా జిల్లాల్లో వ్యాపార సంఘాలన్నీ ముందుకు వచ్చి ఆదివారం బంద్ ప్రకటించాయి. కరోనా నియంత్రణలో తమ వంతుగా సాయంత్రం వరకే షాపులు తెరవాలని.. మాస్కు పెట్టుకున్న వారికి మాత్రమే సరుకులు విక్రయించాలని నిర్ణయించారు. కొన్ని గ్రామాల్లో అయితే మా ఊరికి రావొద్దు అంటూ బోర్డులు కూడా పెడుతున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున, కర్నూల్లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్దరేసి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
24 గంటల వ్యవధిలో 2 వేల 343 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9 లక్షల 09 వేల941కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44వేల 686 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు
ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు చూస్తే భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. కేసులకు తోడు మరణాలు కూడా పెరగడం ఆందోళన పెంచుతోంది.
ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 1,56,77,992 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,171, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి.
ఆంద్ర ప్రదేశ్ లో మళ్లీ లాక్ డౌన్ తప్పేలా లేదు. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా లాక్ డౌన్ కోసం ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసులు రెట్టింపు అయితే అన్ని చోట్ల ఇదే తరహా ఆంక్షలు అమలయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా త్వరలో నైట్ కర్ఫ్యూ అమలు పరిచే దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది.